‘బతుకమ్మ’తో ఇందిరా గాంధీ: తెలంగాణ ప్రజలకు ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఆడపడుచులు కూడా ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ పండగతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆనాటి ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు ప్రియాంక. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో తన నానమ్మ ఇందిరా గాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని వ్యాఖ్యానించారు.

'తెలంగాణా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 1978లో ఓరుగల్లు మహిళలతో మా నానమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి.
ప్రకృతిని ప్రేమిస్తూ, పూవులను పేర్చి, ఊరు వాడా కలిసి చేసుకునే ఈ పండుగ మీకూ, మీ కుటుంబ సభ్యులకీ ఆనందాన్ని, సంతోషాన్ని కలుగచేయాలని కోరుకుంటున్నాను' అని ట్విట్టర్ వేదికగా ప్రియాంక గాంధీ వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఊరువాడా అంతా పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటూ పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఆడపడుచులు కూడా పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications