తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు: ఈడబ్ల్యూఎస్ అమలుకు ఉత్తర్వులు
హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు, హర్ ప్రీత్ సింగ్, అరవింద్ కుమార్‌లకు ఎపెక్స్ స్కేల్‌కు పదోన్నతి కల్పించారు. దీంతో వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా లభించింది.
పదోన్నతి తర్వాత కూడా ముగ్గురు అధికారులు ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ పోస్టులను రీడిజిగ్నేట్ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సంచాలకులుగా హర్ ప్రీత్ సింగ్ కొనసాగనున్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు ఇది తీపి కబురే. ఎందుకంటే అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎష్ రిజర్వేషన్ల అములపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రూ. 8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆదాయ ధృవపత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారు. ధృవ పత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎష్ నియామకాల్లో మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు. అంతేగాక, ఈడబ్ల్యూఎస్ వారికి నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలోనే పరీక్ష రుసుముల్లో మినహాయింపు ఉంటుంది.
ఇక ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. రిజర్వేషన్ల కోసం సబార్డినేట్ సర్వీసు నిబంధనలకు సవరణ చేశారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీ చేయడంలో అగ్రవర్ణపేదల్లోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications