సినిమాల్లో హీరోలు కావొచ్చు గానీ..: అల్లు అర్జున్‌పై తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు
Telangana DGP Jitender: అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. అలాంటి షోలు రద్దు చేస్తామంటూ నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారు. రేవతి మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్‌కు వెళ్లాననడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పూలేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్‌షో చేయలేదని, పోలీసుల డైరెక్షన్‌లోనే థియేటర్‌కు వెళ్లాననీ అన్నారు.
ఈ ఉదంతంపై తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ జితేందర్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరీంనగర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేకరులు- అల్లు అర్జున్ గురించి ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు.
ఎవరినీ కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టాలని తాము అనుకోవట్లేదని జితేందర్ అన్నారు. రాష్ట్ర ప్రజలుగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ప్రతి ఒక్కరి భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని, అన్నింటికంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యతన ఇవ్వాలని, తాము స్వయంగా వాటిని అనుసరించాలని చెప్పారు.
సినిమాల్లో హీరోలు కావొచ్చు గానీ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో, సామాజిక సమస్యలేమిటనేది అర్థం చేసుకోవాలని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ప్రజల భద్రత కంటే కూడా సినిమా ప్రమోషన్ అనేది ఎంతమాత్రమూ ప్రాధాన్యత గల అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ తప్పు జరిగిపోయిందని, ఇలాంటి సంఘటనలు సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications