తెలంగాణ అంటే ఆ 3 నియోజకవర్గాలేనా?: రైతులు కన్నీళ్లు పెడ్తున్నారంటూ రఘునందన్ రావు
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కోతలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రగల్బాలు పలికిందని.. గత మూడు రోజులుగా పల్లెల్లో 3 నుంచి 5 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.

రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు: కేసీఆర్ సర్కారుపై రఘునందన్ ఫైర్
సీఎం కేసీఆర్ తో పాటు ఏ మంత్రి మాట్లాడినా తెలంగాణ దేశానికి దిక్సూచి అని చెబుతున్నారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కొనేందుకు నిధులు లేవా? ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇలా చేస్తాందా? అనేది తెలియడం లేదు. పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో కరెంట్ కోతలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఆ 3 నియోజకవర్గాలు మినహా.. మిగితా ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఎక్కడ?
గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మినహా ఇతర నియోజకవర్గాల్లో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపించగలరా? అని కేసీఆర్ సర్కారుకు రఘునందన్ రావు సవాల్ విసిరారు. 3 ఫేస్ ద్వారా ఎన్ని నియోజకవర్గాలకు విద్యుత్ అందించారో చెప్పాలని, ఇవన్నీ కేసీఆర్ కు తెలిసే జరుగుతున్నాయని భావిస్తున్నట్లు రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. వీలైనంత వరకు పగటి పూట 9 గంటలు ఇచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దుబ్బాక, పాలకుర్తిలలో 3 ఫేస్ కరెంట్ లేదని, ప్రభాకర్ రావు సొంత ఊరికి, ఎర్రబెల్లి నియోజకవర్గానికి, నా నియోజకవర్గంలోకి ఎక్కడికైనా వెళ్దామని ఆయన సవాల్ చేశారు. రాష్ట్రంలోని ఏ ఊరికి అయిన వెళ్దాం.. 24 గంటల కరెంట్ ఇస్తున్న ట్లు రైతులు చెబితే తాను ఏ శిక్షకు అయిన సిద్ధమని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 24 గంటలు ఉచిత కరెంట్ ఎక్కడ ఇచ్చారో చెప్పాలని, చెప్పినట్టు వినాలనే రిటైర్డ్ అధికారులను పెట్టుకుంటున్నారన్నారు.

చేసేది టీఆర్ఎస్ సర్కారు.. బీజేపీపై ఆరోపణలా?: రఘునందన్ రావు
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం.. బాగుపడదని రఘునందన్ రావు దుయ్యబట్టారు. రైతులకు రాత్రి పూట కరెంట్ ఇవ్వాలని, దుబ్బాక ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతారని హరీష్ రావు ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఈఆర్‌సీ చైర్మన్ శ్రీరంగారావు మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పారని, మరి మీటర్లు పెట్టాలనే నిర్ణయం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వందా? ఈఆర్‌సీదా..? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్లకు, గజ్వేల్ లకు ఇస్తున్నట్టు కరెంట్‌ను దుబ్బాక నియోజకవర్గానికి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కృష్ణ జలాల విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మధ్యనే ఉప సంహరించుకుంది. టైమ్ వృధా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందనేది టీఆర్‌ఎస్ నేతల ఆలోచన... ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి పునాదులు కదిలిస్తుందో ప్రజలు నిర్ణయిస్తారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications