రేపు వరంగల్ కు రాహుల్ గాంధీ.. ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్!!
తెలంగాణలో రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఒకేరోజు ఐదు నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు, పాదయాత్రలతో రాహుల్ గాంధీ హోరెత్తించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రాహుల్ గాంధీ పర్యటన ప్రత్యర్థి పార్టీలకు టెన్షన్ పుట్టిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇక రాహుల్ గాంధీ పర్యటన వివరాల్లోకి వెళితే నవంబర్ 17వ తేదీన ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు పినపాక చేరుకుంటారు. రెండు గంటలకు పినపాక లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ను నిర్వహిస్తారు. ఆ తర్వాత పినపాక నుంచి నర్సంపేటకు చేరుకుంటారు రాహుల్ గాంధీ.

మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేటలో రాహుల్ గాంధీ రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. తూర్పు నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వెళ్లనున్న రాహుల్ గాంధీ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు.
ఆరున్నర గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్ రాహుల్ గాంధీ చేరుకుంటారు. రాజేంద్రనగర్లో సమావేశం తర్వాత ఢిల్లీకి రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణమవుతారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు వరంగల్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో అక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి తరఫున రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించనున్న రాహుల్ గాంధీ, అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకొని, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖను గెలిపించాలని కోరుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్ నుంచి పోచమ్మ మైదాన్ వరకు పాదయాత్ర చేస్తారు.
అక్కడ నిర్వహించే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆపై రాజేంద్ర నగర్ వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications