Human Trafficking: అక్రమంగా తరలిస్తున్న 25 మంది పిల్లలను రక్షించిన రైల్వే పోలీసులు..
రైల్వే స్టేషన్లలో మానవ అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి అక్రమ తీసుకొస్తున్న 25 మంది పిల్లలను రక్షించారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 12 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలను నగరంలోని చిన్నతరహా పరిశ్రమల్లో పనులు చేయించడానికి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఆపరేషన్ యాక్షన్ ఎగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ (AAHT)లో భాగంగా, RPF-సికింద్రాబాద్ సిబ్బంది ఒక NGO సహకారంతో, బచ్‌పన్ బచావో ఆందోళన్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న పిల్లలను రక్షించారు.
"ఆర్‌పిఎఫ్ విజయవాడ, వరంగల్ స్టేషన్‌ల మధ్య సోదాలు నిర్వహించి పిల్లలను రక్షించింది" అని సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మిత సి. బెనర్జీ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు హన్మకొండలోని బాలల గృహంలో ఆశ్రయం కల్పించారు. మే 2022లో BBA, RPF ఉమ్మడి లక్ష్యంతో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. RPF, BBA రెండూ కలిసి సమాచారాన్ని పంచుకోవడానికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పని చేయడానికి కృషి చేయనున్నాయి.

ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు, పిల్లలను నిందితులు అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాకు రైళ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే రైళ్లలో తరుచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. " బాలల రక్షణకు చాలా బలమైన చట్టాలు ఉన్నప్పటికీ అన్ని రకాల దోపిడీ, బాల కార్మికుల పిల్లలు, ప్రజలు తక్కువ వయస్సు గల పిల్లలను వాణిజ్య కార్యకలాపాలలో నియమించడం, వారిని దోపిడీ చేయడం కొనసాగిస్తున్నారు" అని బచ్‌పన్ బచావో ఆందోళన్ డైరెక్టర్ మనీష్ శర్మ చెప్పారు.
"ఇవి తీవ్రమైన నేరాలు, సమస్యను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అక్రమ రవాణా నిరోధక బిల్లును వీలైనంత త్వరగా అమలులోకి తీసుకురావాలి" అని ఆయన అన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలను ఎవరూ పనిలో పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications