Railway projects: తెలంగాణాకు శుభవార్త.. కీలకదశలో రూ.7840 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ లు!
భారతీయ రైల్వే రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేకమైన దృష్టిని సారిస్తుంది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే రైలు మార్గాల నిర్మాణంలో రైల్వే ప్రాజెక్టుల పనులలో పురోగతిని సాధిస్తుంది. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిపై ఫోకస్ చేసిన కేంద్రం పూణే ముంబై వైపు వెళ్లే సికింద్రాబాద్ వాడి మార్గాన్ని రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లకు విస్తరించాలని సిద్ధమవుతోంది.
సికింద్రాబాద్ -వాడి నాలుగు లైన్ల రైల్వే ప్రాజెక్ట్
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ రైల్వే బోర్డుకు చేరింది. దీనికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ ప్రాజెక్టు మంజూరవుతుందని సమాచారం. ఇక ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరో రెండు లైన్ల మంజూరు అంశం కీలక దశలో ఉంది.

రైల్వే బోర్డుకు చేరిన మూడు రైల్వే లైన్ ప్రాజెక్ట్ లు
కరీంనగర్ హసన్ పర్తి తో పాటు, డోర్నకల్ మిర్యాలగూడలో కొత్త రైల్వే లైనులకు సంబంధించి కూడా డిపిఆర్ లు ఇప్పటికే రైల్వే బోర్డు కు చేరాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కూడా ఈ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి వీటిని ఎలాగైనా వచ్చే కేంద్ర బడ్జెట్లో మంజూరు చేసేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
7840.37కోట్ల రూపాయల వ్యయంతో మూడు రైల్వే ప్రాజెక్ట్ లు
మొత్తం ఈ మూడు ప్రాజెక్టులు వ్యయం దాదాపు 7840.37కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి అంచనా వ్యయం, దూరం, అలైన్మెంట్ వంటి వివరాలను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ లో రైల్వే బోర్డుకు పంపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుండి పూణేకి వెళ్లే శతాబ్ది ఎక్స్ప్రెస్, ముంబైకి వెళ్లే హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ తో సహా పలు రైళ్లు వికారాబాద్ వాడి మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి.
కొత్త రైల్వే లైన్లతో అనేక రైల్వే మార్గాలు అనుసంధానం
అయితే ప్రస్తుతం వాడి మార్గంలో కేవలం రెండు లైన్ల రైలు మార్గమే ఉండడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇక అంతే కాకుండా డోర్నకల్ మిర్యాలగూడ, కరీంనగర్ హసన్పర్తి మార్గం మంజూరు అయితే ఈ కొత్త రైల్వే లైనులతో అనేక రైల్వే మార్గాలు అనుసంధానం చేయబడతాయని భావిస్తున్నారు.
ఈ కొత్త రైల్వే లైన్ లతో లాభం ఇదే
డోర్నకల్ మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ తో విజయవాడ, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ రైలు మార్గాలు అనుసంధానమవుతాయని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక హసన్పర్తి నుంచి హుజరాబాద్ మీదుగా కరీంనగర్ వరకు కొత్త రైల్వే మార్గం ఏర్పాటు జరిగితే జగిత్యాల, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగాబాద్ మార్గంలో రైలు రాకపోకలకు వీలవుతుంది.
కీలక దశలో ఉన్న రైల్వే ప్రాజెక్ట్ లు
ఇక ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో డిపిఆర్ లు రైల్వే బోర్డుకు చేరడంతో వీటి పైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపీలు ప్రత్యేకమైన దృష్టి సారిస్తే ఈ రైల్వే ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో రైల్వే రవాణాను మరింత మెరుగుపరిచి రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications