తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. మరో వారం పాటు వానలే వానలు..
తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఈ మేరకు రాత్రి 9 గంటల వరకు వివిధ చోట్ల కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో అత్యధికంగా 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కొమురం భీం జిల్లా రెబ్బనలో అత్యధికంగా 96.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇక వరంగల్ జిల్లా రాయపర్తిలో 95.5 మిల్లీమీటర్లు అలాగే వర్ధన్నపేటలోనూ దాదాపు 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇక రానున్న 24 గంటల్లో అంటే ఆదివారం రోజున పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక రానున్న వారం రోజుల పాటు తెలంగాణకు వానగండం ఉందని వివరించారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. తెలంగాణలో వర్షాల ఉద్ధృతి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని అంచనా వేశారు.
తెలంగాణలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే అటు నల్లగొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

అటు హైదరాబాద్ లోనూ మోస్తరు వానలు కురిసే ప్రమాదం ఉందని.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. మరోవైపు వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా దోమలు, కలుషిత నీరు, గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications
