వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్; మానవత్వం అంటే ఇదే!!
గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజేంద్రనగర్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు.
పోలీస్ అంటే శాంతిభద్రతలను పరిరక్షించడానికి కఠినంగా వ్యవహరించడమే కాదు.. అవసరమైన సమయాల్లో, ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగా స్పందించడం కూడా అవసరమే. ఇటీవల ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా పోలీసులు అవసరమైనప్పుడు ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఒక వ్యక్తి ప్రాణాలను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు.
రాజేంద్ర నగర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని కూడా ప్రదర్శించారు. ఎల్బీనగర్ నుండి ఆరం ఘర్ వైపు వెళుతున్న బస్సులో ప్రయాణం చేస్తున్న బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ చౌరస్తాలో బస్సు దిగారు. బస్సు దిగడంతోనే అతను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే అతని వద్దకు వెళ్లి, అతని పరిస్థితి గమనించి ఛాతీపై బలంగా ప్రెస్ చేసి సిపిఆర్ చేశారు.

గుండెపోటుతో ఆగిపోతున్న అతని గుండెను మళ్లీ బ్రతికించే ప్రయత్నం చేశారు. ఆపై బాలాజీ కాస్త ఊపిరి పీల్చుకోవడంతో, ప్రాణాపాయం తప్పిందని భావించి, అప్పటికే 108కు సమాచారం అందించి బాలాజీ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ యువకుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కానిస్టేబుల్ మానవత్వాన్ని ఈ వీడియో చూసిన వారు కొనియాడుతున్నారు. ఎవరు ఎలా పోతే మాకేంటి అని పక్కన వాళ్ళను కూడా పట్టించుకోని వారు ఉన్న నేటి రోజుల్లో ఎవరో తెలియని వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇది కదా మానవత్వం అంటే అని ఆయనను ప్రశంసిస్తున్నారు.
రాజేంద్రనగర్లో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ pic.twitter.com/PNrbFX6qrY
— oneindiatelugu (@oneindiatelugu) February 24, 2023












Click it and Unblock the Notifications