ఆ 5 జిల్లాలకు మహర్దశ.. ఇకపై 8 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా ఆ రోడ్డు..
రాజీవ్ రహదారి.. ఉత్తర తెలంగాణలోనే అత్యంత కీలకమైన ఒకటవ నెంబర్ రహదారిగా పేరుంది. హైదరాబాద్ ను ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలతో కలిపే ఈ రాజీవ్ రహదారిని 8 లైన్లకు విస్తరించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. సుమారు మూడు దశాబ్దాల కృతం ఈ రహదారిని నిర్మించారు. ఇటీవలి కాలంలో ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసి ఈ 4 రోడ్ల రహదారిని 8 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గుంతలమయంగా మారిన రోడ్లను బాగు చేయడానికి రూ. 622 కోట్లతో 17 ప్యాకేజీలను సిద్ధం చేసింది. 537 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ పనులను హ్యామ్ (Hybrid Annuity Model) పద్ధతిలో అధికారులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ రహదారిపై ఇటీవలి కాలంలో ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నివారించి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దాదాపు రూ.400 కోట్ల మేర ఖర్చు చేసి రాజీవ్ రహదారిని ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఈ 4 లైన్ల రహదారి త్వరలోనే ఎనిమిది లైన్లకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ను ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలతో రాజీవ్ రహదారి కలుపుతుంది.
ప్రస్తుతం 4 లైన్లుగా ఉన్న ఈ రోడ్డును ఎనిమిది లైన్లకు విస్తరించే నేపథ్యంలో మలుపులను పూర్తిగా తొలగించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైతే భూసేకరణ చేసి నూతన మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల మధ్యగా వెళ్లే ప్రస్తుత రహదారిని మినహాయించి ఊరి బయట కొత్త ట్రాక్ రూపకల్పనతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ రహదారి ములుగు మండలం వంటిమామిడి వద్ద ప్రారంభమై బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు ఉంది. ఎక్కడా కూడా స్పీడ్ లిమిట్ మానిటరింగ్ కేంద్రాలు లేవు. జిల్లాలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో ఈ రాజీవ్ రహదారిపైనే 40 శాతం వరకు అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రహదారిలో ప్రమాదకర మలుపులు 60 ఉన్నాయి. ఈ దారిపై ఏటా 250 ప్రమాదాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications