తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల అమలుకు ముహూర్తం పెట్టేశారు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 64,170 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,821 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందజేసే సిఫారసు లేఖలను అమలు చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. వాళ్లు పంపించే సిఫారసు లేఖలపై సోమవారం అంటే మార్చి 24వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
సాధారణంగా శ్రీవారి దర్శనానికి ఒక్క రోజు ముందు ఇలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరిస్తుంటారనే విషయం తెలిసిందే. అదే విధంగా సోమవారం నాటి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శన భాగ్యాన్నికల్పించడానికి నేడే వాటిని తీసుకుంటారు.
ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా ఈ నెల 30వ తేదీన శ్రీవిశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 25వ తేదీ మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి.
ఫలితంగా- 25వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం 24వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు స్వీకిరించరు. అలాగే ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆదివారం ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫారసు లేఖలు ఇకపై శనివారం నాడే వాటిని తమకు అందజేయాల్సి ఉంటుందని టీటీడీ ఇదివరకే వెల్లడించింది.












Click it and Unblock the Notifications