అందరూ మాటలు చెప్పారు కానీ చేసి చూపించింది సీఎం రేవంత్: రేణుకా చౌదరి కితాబు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు మనిషి కాదు చేతల మనిషి అని, మాటలు అందరూ చెప్తారు కానీ చేసి చూపించింది మాత్రం రేవంత్ రెడ్డి అని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం పైన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు.
రేవంత్ నిర్ణయంపై రేణుకా చౌదరి ప్రశంసలు
రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని సామాజికంగా గొప్ప మార్పుకు నాంది అని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుతో ఆదర్శంగా నిలిచిందని ఈరోజు తమకు ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కూడా ఇవి గర్వపడే రోజులని రేణుక చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీసీలకు రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు
42 శాతం బీసీ రిజర్వేషన్ నిర్ణయం చేస్తూ క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ తో బీసీలకు రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని రేణుక చౌదరి పేర్కొన్నారు. దీనిపైన జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని, తనకు దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి మెసేజ్ లు వస్తున్నాయని, ప్రజలు కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారని రేణుక చౌదరి తెలిపారు.
దేశానికే మార్గదర్శకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు
అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె అన్నారు. గతంలో రాజీవ్ గాంధీ ఒక్క సంతకంతో మహిళల జీవితాలను మార్చారని, ఆయన తీసుకున్న నిర్ణయంతో భర్తలు కూడా మహిళల పట్ల గౌరవాన్ని చూపారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలో బీసీలకు చరిత్ర సృష్టించే నిర్ణయం తీసుకున్నారని, 42 శాతం రిజర్వేషన్ కల్పించడం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని రేణుక చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పూటకో సారి పార్టీ పేరు మారుస్తారని... బీఆర్ఎస్ నేతల ఎద్దేవా
ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె ఎమ్మెల్సీ కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు పూటకో సారి పార్టీ పేరు మారుస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని, ఆ పార్టీ ప్రజలకు చేసేదేమీ లేదని తేల్చి చెప్పారు.
రేవంత్ కి కితాబు ఇచ్చిన రేణుకా చౌదరి
బీఆర్ఎస్ నేతలు ఇంతకాలం చెప్పినవి సొల్లు కబుర్లు అని, ప్రస్తుతం రాష్ట్రానికి అసలైన సీఎం లభించారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. మొత్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాజీ మంత్రి రేణుక చౌదరి రేవంత్ రెడ్డికి కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications