ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మరో ఇద్దరు ఆనవాళ్లు !
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టులో చోటు చేసుకున్న విషాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత నెల 22న జరిగిన ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లోనే చిక్కుకుపోయారు. వారంతా మృతి చెందగా వారి మృతిదేహాలను వెలికితీసేందుకు 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. ఆదివారం నాడు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.
మృతదేహం ఎత్తు, చేతి కడియం సహా పలు ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ గా గుర్తించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. అయితే ఇప్పుడు గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉందని సమాచారం.

గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరాన్. ఆయన రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గుర్ ప్రీత్ కు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారంతా స్వస్థలంలో ఉండగా గుర్‌ప్రీత్ మాత్రం మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్, క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అధికారులు తవ్వకాలు చేపదుతున్నారు. గుర్ ప్రీత్ మృతదేహాన్ని డీ2 ప్రాంతంలోనే గుర్తించారు. గుర్‌ప్రీత్‌సింగ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.
ఇక డీ1, డీ3 ప్రాంతాల్లో 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇనుప ప్లేట్లు, రాడ్స్ అడ్డుగా ఉండటంతో ప్లాస్మా కట్టర్ల సాయంతో వాటిని కత్తిరిస్తున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ కట్టింగ్, డీ వాటరింగ్ పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో.. దాని ద్వారా శిథిలాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు.












Click it and Unblock the Notifications