ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం.. తీవ్ర హెచ్చరిక!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పైన నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తన పైన అధికార పక్షం తీవ్రంగా స్పందించింది.
కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
మంత్రి దామోదర రాజనర్సింహ ఈ మేరకు సభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలపై సభ తరఫున కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు, నేతలు ప్రవర్తించిన తీరుపై విపక్షనేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో మాట్లాడుతూ మంత్రి, ఎస్సీల చరిత్ర కేవలం ఒక వర్గానికి సంబంధించినది కాదని, అది జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

దళిత సమాజాన్ని, యువతను తక్కువగా అంచనా వెయ్యొద్దు: మంత్రి హెచ్చరిక
మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదన్నారు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర, ఆత్మగౌరవ చరిత్ర అని పేర్కొన్నారు. ఆత్మగౌరవమే మా అలంకారం,ఆత్మగౌరవమే మా స్పూర్తి అంటూ భావోద్వేగానికి గురయ్యారు.ఆ ఆత్మగౌరవంతోనే ఇక్కడి వరకూ వచ్చామన్నారు.ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ యువతను, ముఖ్యంగా దళిత సమాజాన్ని, యువతను తక్కువగా అంచనా వేయొద్దన్నారు.
ఇది క్షమించరాని నేరం
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, అయితే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను, అత్యున్నత పదవులలో ఉన్నవారి హుందాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. స్పీకర్ స్థానం ఏ ఒక్క కులానికో, మతానికో చెందినది కాదని, అలాంటి పీఠంపై కూర్చున్న వ్యక్తిని అవమానించడం క్షమించరాని నేరమని మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదన్నారు.
అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం శాసనమండలికి
ప్రజా జీవితంలో ఉన్నవారు ఎంతో బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు.మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పూర్తిగా బలపరిచారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తీర్మానం పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీలపై చర్యలకు సంబంధించిన అధికారిక తీర్మాన కాపీని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపనున్నారు. ఆపై మండలిలో ఆమోదం పొందాక నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.













Click it and Unblock the Notifications
