ప్రతిష్ఠాత్మకంగా మారిన మున్సిపాలిటీలు- రిజల్ట్ పైనే భవిష్యత్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఈ ఎన్నికల సమరం- అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. వీటి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.
మొత్తం 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. వీరిలో 25.50 లక్షల మంది పురుషులు కాగా, 26.67 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,569 వార్డులు, అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, 116 మున్సిపాలిటీలలోని 2,569 వార్డులకు గాను 10,719 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్ జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత నియోజపకవర్గం మధిరలో.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటు వేశారు. ఇక్కడి ఇందిరా డెయిరీ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications