Revanth reddy: గురుకులం గోడ దూకి షాకింగ్ పని చేసిన ఫైర్ బ్రాండ్!!
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతుందా? నిన్నటికి నిన్న ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి తాజాగా మరొక సంచలన చర్యకు పాల్పడ్డారా? గతానికి భిన్నంగా రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ప్రవర్తిస్తున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
రేవంత్ రెడ్డి సంచలన చర్య
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం ఇచ్చిన నాటి నుండి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు, అనేక ఊహించని చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకత్తిస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా, ఇటీవల ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చి వేయాలంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోమారు రేవంత్ రెడ్డి సంచలన చర్యకు పాల్పడ్డారు.
గోడ దూకి గురుకులంలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎస్టీ మినీ గురుకులంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి గేటుకు తాళం వేసి ఉండడంతో గోడ ఎక్కి దూకేశారు. లోపలికి వెళ్లి విద్యార్థులను, ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలపై ఆరా తీశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయులు రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
చర్చనీయాంశంగా మారిన రేవంత్ రెడ్డి చర్య
అంతకు ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉందని తెలిసిన గురుకులం విద్యార్థినులు హాస్టల్ గోడ వద్ద నిలబడి రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారితో కాసేపు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ చిట్టి తల్లుల ప్రేమ ముందు గోడ ఒక లెక్కనా అంటూ గోడ దూకి లోపలికి వెళ్ళారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తించడం లేదు అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది. గేటుకు తాళం వేసి ఉంటే గోడ దూకి వెళతాడా అంటూ రేవంత్ రెడ్డి గోడ దూకిన వ్యవహారం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి గోడ దూకి ఏం సందేశం ఇస్తున్నారు?
గేటు తాళం తీయించుకొని వెళ్లొచ్చు కదా అంటూ కొందరు రేవంత్ రెడ్డి తీరుపై చర్చిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన పని ముందు ముందు భవిష్యత్తులో వేరే ఎవరైనా చేస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇలా గోడలు దూకటం వంటి పనులతో ఏం సందేశం ఇస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆయన చేసిన చర్య మాత్రం మంచిది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న విషయం మరచిపోకూడదని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications