అరెస్ట్, లాఠీఛార్జ్: రేవంత్ ఆగ్రహం, ఐటీలో ఉద్యోగాల అంశంపై జానారెడ్డి
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు పైన కొడంగల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి గురువారం నాడు మండిపడ్డారు. మంత్రి జూపల్లి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు.
ఏ నియోజకవర్గంలో అయినా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాంటిది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడుతున్నారన్నారు.
కెసిఆర్ పెద్ద దొర అయితే జూపల్లి చిన్న దొర అని ఎద్దేవా చేశారు. పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పనులు ఎలా చేపడతారని జూపల్లిని ప్రశ్నించారు.

కాగా, అంతకుముందు జూపల్లి తీరును నిరసిస్తూ రేవంత్ రెడ్డి ధర్నాకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్ యార్డు గోదాము భూమిపూజ కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. రేవంత్ ధర్నా చేయడంతో అరెస్టు చేశారు.
రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌల్తాబాద్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్తత తలెత్తింది.
పోలీసులు, టిడిపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో టిడిపి కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల పైనా పోలీసులు లాఠీఛార్జి చేశారు.
రాజీవ్ ఆశయాలు యువతకు ఆదర్శం: జానారెడ్డి
రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు ఆదర్శమని జానా రెడ్డి గురువారం అన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే అన్నారు. రాజీవ్ వేసిన పునాదులతోనే లక్షలమందికి ఐటీలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో రక్తదాన శిబిరంలో జానా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications