రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డిపైనా సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణ భవన్‌లో జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారన్నారు కేటీఆర్. మోడీ చోటాభాయ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) గుజరాత్ మోడల్‌ను పొగుడుతున్నారని, బీజేపీ పాట పాడుతున్నారన్నారని వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, 40 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయచేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, భయపడే వాళ్లు లేరని కేటీఆర్ అన్నారు.
సామంత రాజులా ఢిల్లీకి 2500 కోట్లు కప్పం కట్టారని, ఇందుకోసం అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. కేసీఆర్ కట్టిన 36 ఫ్లై ఓవర్లు, కేంద్రం చేపట్టిన అంబర్‌పేట ఫ్లై ఓవర్ల గురించి మాట్లాడాలన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తే హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని, దురదృష్టకరంగా కాంగ్రెస్ చిల్లర ప్రచారాన్ని కొందరు నమ్మారని కేటీఆర్ గత ఎన్నికల ఫలితాలపై స్పందించారు. కవితను అరెస్ట్ చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గతంలో కాంగ్రెస్ నేతలు అన్నారన్న కేటీఆర్.. ఇవాళ పగపట్టి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటుందని కేటీఆర్ నిలదీశారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవు, అత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న కేటీఆర్.. పార్టీ మారిన దానం నాగేందర్ నిర్ణయం తప్పన్నారు. అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్లారని ఆయన ఆక్షేపించారు. ఖైరతాబాద్ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి.. దానం నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం ఉందన్నారు. సికింద్రాబాద్‌లో పద్మారావు గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కేటీఆర్ కోరారు.
బీజేపీ, మోడీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారని.. దీనిపై బీఆర్ఎస్ తరపున పోరాడతామన్నారు. లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారని, వాటిని కోర్టుకు ఇవ్వాలని ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. అక్రమ కేసులతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తమను ఏమీ చేయలేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications