జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఫార్ములాతో రేవంత్ , అక్కడే మలుపు..!!
జూబ్లీహిల్స్ లో ఫలితం పై ఎగ్జిట్ పోల్స్ తేల్చేసాయి. పార్టీల్లోనూ తుది ఫలితం పైన క్లారిటీ ఉంది. ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ అభ్యర్ధి ఖరారు.. ఎంఐఎం సహకారం.. ప్రచార వ్యూహాలను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నారు. బీఆర్ఎస్ బలాలు, బలహీన తలను తనకు అనుకూలంగా మలచుకున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ జూబ్లీహిల్స్ లోనూ అమలు చేసారు. దీంతో, ఫలితం ఏంటనేది ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ లో గెలుపు అందరి కంటే సీఎం రేవంత్ కు చాలా అవసరం. ఇక్కడ గెలిస్తే తన రెండేళ్ల పాలనకు వచ్చిన తీర్పుగా చెప్పుకోవచ్చు. ఫలితం తేడా వస్తే పార్టీతో పాటుగా ప్రభుత్వం లోనూ విమర్శలు ఎదుర్కోవాల్సిందే. బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక లో గెలుపు కోసం అన్ని శక్తులు ఒడ్డించింది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనుండటంతో.. మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం గా మారింది. అయితే.. రేవంత్ అభ్యర్ధి విషయంలో పక్క లెక్కలతో ముందుకు వెళ్లారు. ఢిల్లీ నేతల వద్ద ఫ్రీ హ్యాండ్ తీసుకున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఎంఐఎంతో ఒప్పందం కలిసి వచ్చింది. కాగా.. నాడు నంద్యాలలో చంద్రబాబు అమలు చేసిన ఫార్ములా తరహాలోనే రేవంత్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ ఆపరేషన్ కొనసాగించారు.

2017 ఆగస్టులో ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసారు. వైసీపీకి పట్టున్న ప్రాంతం కావటంతో ఇక్కడ గెలుపు కోసం చంద్రబాబు దాదాపు తన కేబినెట్ మొత్తాన్ని మొహరించారు. తాను ప్రచారం చేసారు. మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. సామాజిక వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపారు. పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త హామీలు ఇచ్చారు. ఫలితంగా నంద్యాల పట్టణంతో పాటు ఈ సెగ్మెంట్‌లోని పలు మండలాల్లో కూడ ఆయన పర్యటించారు. అటు జగన్ సైతం చివరి నిమిషం వరకు పోరాటం చేసారు. ఫలితంగా టీడీపీ అభ్యర్ధి 27,296 ఓట్లతో గెలుపొందారు.
ఇక.. జూబ్లీహిల్స్ లోనూ రేవంత్ ఇదే ఫార్ములాతో తన ఆపరేషన్ కొనసాగించారు. మంత్రులను పూర్తిగా రంగంలోకి దించారు. ప్రతీ వార్డుకు ఇంఛార్జ్ లను నియమించారు. సామాజిక వర్గాల వారీగా నేతలను మొహరించారు. తానే ప్రచారంలోకి దిగారు. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. మంత్రులకు వ్యూహ రచనల అమలు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచే ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి కొత్త హామీలు గుప్పించారు. చివరి రెండు రోజుల్లో వ్యూహాత్మకం గా వ్యవహరించారు. దీంతో.. పోలింగ్ సరళి..ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.
తుది ఫలితం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా రేవంత్ త్వరలో స్థానిక సంస్థలు... ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్దం కావటంతో పాటుగా పార్టీలో .. ప్రభుత్వంలో తన పట్టు పెంచుకోవటానికి ఈ ఫలితం అస్త్రంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో జూబ్లీ హిల్స్ ఫలితం వేళ.. పొలిటికల్ సర్కిల్స్ నాటి నంద్యాల ఉప ఎన్నిక రాజకీయం గుర్తు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications