తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... పలు జాగ్రత్తలు సూచించిన ఐఎండీ...
మార్చి నెల రాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక, తెలంగాణ రాష్ట్రంలో గత రెండుమూడు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని, ఎండల్లో బయట తిరిగే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉదయం తొమ్మిది నుంచే భానుడు సెగలు కక్కిస్తున్నాడు. దీంతో పాఠశాలలకు వెళ్లేవారు. ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరేమో ఇంటినుండి బయటకు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వారు కోరుతున్నారు. ఒక్క బుధవారం నాడే హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఈ పరిస్ధితి ఇదే విధంగా కొనసాగితే ఈ నెల చివరి నాటికి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అధికారులు వివరిస్తున్నారు.

బయటికి వెళ్లేవారు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు : ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎండల్లో తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యలు అంటున్నారు. ఈ ఎండల్లో బయట ఎక్కువగా తిరగడం వల్ల శరీరం పొడిబారడం, ఎర్రగా మారడం, దురదలు, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవించినప్పడు తప్పక వైద్యులను సంప్రదించాలి.
ఈ సమయంలో ఎక్కువగా ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు, లేదా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటే డీహైడ్రేషన్ గురికాకుండా వుంటారని తెలిపారు. ఇంతటి ఎండల్లో వ్యాయామం చేసేవాళ్లు, సూర్యోదయానికి ముందే వ్యాయామం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య ప్రజలు బయటకు వెళ్లకపోవటమే మంచిదని ఐఎండీ నిపుణులు సూచిస్తున్నారు. ఇక, ఈసీజన్‌లో నాన్‌వేజ్ ఎంత తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంతమంచిదని నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications