అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ యువకుడు మృతి
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు.. ఊహించని ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేష్ మృతి చెందాడు. కాగా, కుటుంబసభ్యులకు బుధవారం ఈ సమాచారం అందింది.
బోయ వెంకటరాములు, శకుంతల దంపతుల ఇద్దరు కుమారులలో.. పెద్ద కుమారుడు అయిన మహేష్ అమెరికాలో ఎంఎస్(ఇంజినీరింగ్) చదవడానికి గత డిసెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడు. అక్కడి కన్ కోల్డియా యూనివర్సిటీలో చేరి తన విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. కాగా, మంగళవారం రాత్రి కారులో మరో ముగ్గురు స్నేహితుల(శివ, లక్ష్మి, భరత్ )తో కలిసి మరో మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెంగా.. మిగితా వారు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బుధవారం ఉదయం మహేష్ తల్లిదండ్రులు వెంకట రాములు, శకుంతలకు అతని స్నేహితులు ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. ఈ వార్త విన్న మహేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మహేష్ మృతదేహాన్ని అమెరికా నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇది ఇలావుండగా, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ పట్టణానికి ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో గల అలెన్ ప్రీమియర్ దుకాణ సముదాయంలో గత శనివారం ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా.. అందులో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య(27) కూడా ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
ఐశ్వర్య షాపింగ్ చేస్తున్న సమయంలో దుండగుడు తూటాల వర్షం కురిపించాడు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివిన ఐశ్వర్య ఆ తర్వాత 2020లో మిషిగన్ వర్సిటీలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సులో పీజీ పూర్తి చేశారు. అనంతరం పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ సంస్థలో సివిల్ ఇంజినీర్‌గా చేరిన ఆమె.. ఇటీవల ప్రాజెక్టు మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఈ సమయంలో ఆమె కాల్పుల్లో మరణించడం ఆమె కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications