మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన నలుగురు బ్యాంక్ మేనేజర్లు మృతి
హైదరాబాద్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. బాధితులంతా తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్లుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)కి చెందిన డ్రైవర్ షేక్ సల్మాన్, అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గొల్లి వైభవ్ యాదవ్ తోపాటు అర్లి, భీంపూర్, కప్పర్ల, పెండల్‌వాడ, బేలా ప్రాంతాలకు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు కొటేశ్వర్, శివకృష్ణ, శ్యామ్ లింగారెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్‌లు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు.

ఆదివారం, రేపు(సోమవారం) వినాయక చవితి సెలవులు కావడంతో రెండు రోజులు వీకెండ్ విహారానికి వెళ్లారు. అయితే, వర్షం వారికి అడ్డంకిగా మారింది. దీంతో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్ దరా వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఘాట్ రోడ్డు కావడం.. మరోవైపు భీకర వాన కురుస్తుండటంతో చికల్ దరా ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన శ్యాంలింగా రెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్ లను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తామంతా అమరావతిలో జలపాతం చూసేందుకు కారులో బయల్దేరామని, మార్గమధ్యలో వర్షం మొదలైందని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. వాన కురుస్తుండటంతో డ్రైవర్ వాహనాన్ని నెమ్మదిగా నడిపాడు. చికల్ దరా వద్దకు రాగానే అక్కడ మొత్తం ఘాట్ రోడ్డు కనిపించింది. నెమ్మదిగానే రోడ్డుపైకి ఎక్కించాడు డ్రైవర్. కానీ, వర్షం వల్ల డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో తమ కారు అక్కడేవున్న లోయలో పడిపోయిందని తెలిపారు.
మృతులను డ్రైవర్ షేక్ సల్మాన్(28), శివకృష్ణ(30), వైభవ్ లక్ష్మణ్(29), కోటేశ్వర్ రావు(27)గా పోలీసులు గుర్తించారు. విహార యాత్ర విషాదాంతం కావడంతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications