పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ! నగదుతోపాటు విలువైన సొత్తు అపహరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై మాజీ మంత్రి దంపతులిద్దరు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షన్నరతో పాటు భారీగా ఆభరణాలు తస్కరణకు గురయ్యాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని మనుషులతో సహా ప్రతి ఒక్కరినీ విచారించి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఫిలింనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట డ్యూక్స్ అవెన్యూ భవనంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఆకాశ్ ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులో చేశారు. భవనం మొత్తం అద్దాలతో ఉండటంతో దట్టమైన పొగతో నిండిపోయింది. కోజింగ్ సెంటర్‌లోని కంప్యూటర్లు ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న ముగ్గురు ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications