మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు.. రూ.1,108 కోట్లతో ఓంకారేశ్వరాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులో మరో కీలకమైన అడుగు పడింది. మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి గుట్టపై ఓంకారేశ్వరస్వామి ఆలయ సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1,108.27 కోట్లు కాగా చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనుంది.
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ప్రధాన ఆలయ నిర్మాణానికి రూ.598.98 కోట్లు, చుట్టుపక్కల భవనాలు, వసతి సదుపాయాలు, అభివృద్ధి పనులకు రూ.349.67 కోట్లు కేటాయించారు. అలాగే ఆలయాన్ని అనుసంధానిస్తూ మూసీ ఒడ్డున 2.5 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు గల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు కేటాయించారు.

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ రూపొందించిన డీపీఆర్ ప్రకారం, వీరభద్రస్వామి, మచిలేశ్వరస్వామి ఆలయాల పక్కన సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఆలయ సముదాయం నిర్మించబడుతుంది. ఇందులో శ్రీ వీరభద్ర-భద్రకాళి ఆలయం, లలితా మహా త్రిపురసుందరీదేవి, బాలగణపతి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు ఉంటాయి.
మహా మండపం, నంది మండపం, ప్రాకారాలు, యాగశాల, పుష్కరిణి కూడా నిర్మాణం చేస్తారు. గర్భాలయం ఎత్తు 64 అడుగులు ఉండగా, మహా మండపం 44 స్తంభాలతో నిర్మించబడుతుంది. కాకతీయ కాలపు నాగర శైలి వాస్తుకళను అనుసరించి ఆలయ శిఖరాలు రూపొందుతాయి. రెండు ప్రాకారాలు, నాలుగు దిక్కులా ఎనిమిది రాజగోపురాలు ఉంటాయి. ముందు భాగంలో 91 అడుగుల ఎత్తైన, తొమ్మిది అంతస్తుల మహా రాజగోపురం కనువిందు చేస్తుంది.
రామప్ప దేవాలయం పరిసరాల్లో లభించే రాయిని ఉపయోగించి నిర్మాణం జరుగుతుంది. మూసీ నదిలో ఎత్తైన శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారు.పనులు సక్రమంగా జరగాలని ప్రభుత్వం ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీని నియమించింది. రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా, ప్రజారోగ్య శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కో-ఛైర్మన్‌గా, ఎంఆర్‌డీసీఎల్ ముఖ్య ఇంజినీరు కన్వీనర్‌గా ఉంటారు.
దేవాదాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు, ఆలయ శిల్పకళా నిపుణుడు డాక్టర్ శివనాగిరెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ డిజైన్లు, ధరలు, టెండర్లు, సాంకేతిక ఆమోదాలను పర్యవేక్షిస్తుంది.మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా కేవలం నీటి ప్రవాహం, పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసి భక్తులకు, పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఓంకారేశ్వర ఆలయం చాలా ప్రత్యేకంగా నిర్మించబోతోంది.













Click it and Unblock the Notifications
