హైదరాబాద్ మెట్రోకు షాక్: కస్టమర్ నుంచి అదనంగా రూ. 10 వసూలుకు రూ. 10 వేల జరిమానా
హైదరాబాద్/ఖమ్మం: హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు వినియోగదారుల కమిషన్‌లో షాక్ తగిలింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో రూ. అదనంగా వసూలు చేశారనే ఫిర్యాదుతో మెట్రో సంస్థకు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. మెట్రో రైల్వే స్టేషన్ లో ఒక వైపు నుంచి ఇంకొక వైపు వెళ్లినప్పుడు అదనంగా వసూలు చేసిన రూ. 10 తిరిగి ఆ ప్రయాణికుడికి చెల్లించాలని ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన లాయర్ వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ ఎల్బీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో 2019, జనవరి 18న ప్రయాణించారు. మెట్రో రైలు ఎక్కే తూర్పు దారిలో టాయిలెట్లు లేకపోవడంతో పడమరవైపు ఉన్న వేరే దారిలో వెళ్లారు. దీని కోసం మెట్రో రైల్వే సంస్థ జారీ చేసిన ట్రావెల్ కార్డును ఆయన స్వైప్ చేశారు.

అయితే, రూ. 10 ట్రావెల్ కార్డు నుంచి కట్ అయ్యాయి. దీనిపై ఆయన వినియోగదారుల కమిషన్‌లోఫిర్యాదు చేశారు. రెండు వైపులా టాయిలెట్లు ఏర్పాటే చేయకపోవడం వల్లే ఇది జరిగిందని.. మెట్రో సంస్థ నిర్లక్ష్యం ఉందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం డిస్‌ప్లే బోర్డులు పెట్టాలని ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్ ఛైర్మన్ లలిత, సభ్యురాలు మాధవీలత ఆదేశించారు.
అంతేగాక, ప్రయాణికునికి జరిగిన అసౌకర్యానికి రూ. 5వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ. 5 వేలు 45 రోజుల్లోగా చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది. కాగా, ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఛైర్మన్ లలిత, సభ్యురాలు మాధవీలత ఈ మేరకు మంగళవారం తీర్పునివ్వగా.. బుధవారం కాపీ బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications