ఎక్స్‌ట్రా పన్నులకు రేవంత్ సర్కార్ నో: భూముల అమ్మకాలకు సై: టార్గెట్ రూ.35 వేల కోట్లు
Telangana Budget 2024: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. ఇక మూల ధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఊహించినట్టే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ క్రమంలో రైతులపై వరాల జల్లును కురిపించారు భట్టి విక్రమార్క. ఈ సంవత్సరం తాము ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరబోతోన్నామని అన్నారు. దీని ద్వారా అన్నదాతలకు రైతు బీమాను వర్తింపజేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు.
ప్రజలపై అదనంగా ఎలాంటి పన్నులను విధించకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. పన్నులు వేయడం వల్ల వచ్చేఆదాయాన్ని ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సమీకరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల వద్ద అప్పులు చేయడం, భూములను అమ్మకానికి పెట్టడం వంటివి మార్గాలను ఎంచుకున్నట్టే కనిపిస్తోంది.
2024-2025 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం 35,208.44 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలా సమీకరిస్తుందనేది ప్రశ్నార్థకం. దీనికి సంబంధించిన వివరాలను కూడా బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎక్కడ కూడా పొందుపర్చనట్టే.
ఈ మొత్తాన్ని భూముల అమ్మకం ద్వారా సమీకరించాలనేది ఓ ప్రత్యామ్నాయం. ఈ టార్గెట్‌ను గనక అందుకోలేకపోతే- రుణాలను తీసుకోవడానికే మొగ్గు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల్లో కోత పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications