పురుషులను గౌరవించటం మన సాంప్రదాయం.. ఉచిత బస్సులో ఇంట్రెస్టింగ్ పోస్ట్!
స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం. ఇది ఒకప్పుడు మన ఆర్టీసీ బస్సులలో కచ్చితంగా రాసి ఉండే మాట. అప్పట్లో బస్సు ప్రయాణాలు చేసే సమయంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, నిలబడి ఇబ్బంది పడే మహిళలకు కూర్చునే అవకాశం కల్పించాలని ఆర్టీసీ చేసిన సంస్కారవంతమైన సూచన. అయితే అదే ఇప్పుడు రివర్స్ అయింది.
పురుషులను గౌరవించటం మన సాంప్రదాయం.. బస్సులో వింత బోర్డు
స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అన్న చోట ఇప్పుడు పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అని రాసిన ఒక వింత బోర్డ్ సూర్యాపేట జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో దర్శనమిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బోర్డు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు కారణమైంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎఫెక్ట్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సర్వీస్ లను వినియోగించుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో సీట్ల కొరత, ప్రయాణికుల మధ్య వివాదాలు నిత్యకృత్యంగా మారాయి.
సూర్యాపేట రూట్ లో నడిచే బస్సులో బోర్డుపైన చర్చ
ముఖ్యంగా మహిళలకు పురుషులకు మధ్య గొడవలు బస్సులలో సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలో సూర్యాపేట రూట్ లో నడిచే బస్సులో ఈ బోర్డు పెట్టారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ బోర్డు పైన నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంత కాలానికి దక్కిందని కొందరు, పరిస్థితి ఎలా వచ్చింది అని మరికొందరు.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులలో ఇటువంటి బోర్డులు అవసరం ఎంతైనా ఉందని ఇంకొందరు చర్చిస్తున్నారు.
ఏది నిజమో ఆర్టీసీ అధికారులే చెప్పాలి
అయితే ఇది ఆర్టీసి బస్సులో నిజంగా పెట్టిన బోర్డ్ నా లేక ఏ ఐ క్రియేషనా అని ఆలోచిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఆర్టీసీ అధికారుల నుండి ఈ బోర్డు పైన ఎటువంటి అధికారిక స్పందన లేదు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపైన చర్చ జరుగుతున్న వేళ అన్నిటికంటే ముందు అది ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.













Click it and Unblock the Notifications