Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ కంపెనీ.. ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా భాగ్య నగరం..

హైదరాబాద్‌ లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌ కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్‌ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా మారిందని చెప్పారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెంగుళూరు - హైదరాబాద్‌ను డిఫెన్స్, ఎయిరోస్పేస్ కారిడార్‌ గా ప్రకటించాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో ముఖ్యంగా వాటి నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్‌హాల్‌ వంటి సదుపాయాలతో పాటు పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

"తెలంగాణపై ఎంతో నమ్మకంతో Safran గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థకు మా అభినందనలు. ఈ సెంటర్ ఏర్పాటు ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్. ఈ ఫెసిలిటీ సెంటర్‌తో పాటు సాఫ్రన్‌కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (ఎంర్ఓ) కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన పరిణామం" అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

"ఈ MRO భారత వైమానిక దళం, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా 1000 మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంబిస్తోంది. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ ఈజెడ్‌ లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయి" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హం. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందింది. రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నైపుణ్యతను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"ప్రపంచ దేశాల్లోనే అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలన్న సంకల్పంతో హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కు అందరినీ ఆహ్వానిస్తున్నాం. భారత లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామిగా ఉండాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

"LEAP ఇంజిన్‌ లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన A320neo, Boeing 737 MAX విమానాలకు శక్తినిచ్చే ఇంజిన్‌లు. 44,000 చదరపు మీటర్లలో విస్తరించిన ఈ కొత్త MRO ప్రపంచంలోనే సఫ్రాన్‌ కు అతిపెద్దది. రాఫెల్ ఇంజిన్‌ ల కోసం భారత్ వెలుపల మొదటి M88 మిలిటరీ ఇంజిన్ MRO హైదరాబాద్‌ లో స్థాపించబడుతోంది. రూ.450 కోట్ల పెట్టుబడితో 150 మంది టెక్నీషియన్లు, 600 పరోక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. 2026 ప్రారంభంలో పనులు ప్రారంభమవుతాయి" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్‌ చైర్మన్‌ రాస్‌ మెకలెన్స్, సీఈఓ, డైరెక్టర్‌ శ్రీ ఒలివర్‌ అండ్రీస్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ సీఈవో శ్రీ స్టీఫేన్ క్యూయెల్, జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ జీఎం రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

మరోవైపు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీతో పాటు వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను సమ్మిట్ కు ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.

Saffron Aerospace Park Will Be a Historic Milestone for Telangana CM Revanth Reddy

ఇక ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాన్ని అందించామని సీఎంకు అధికారులు తెలిపారు. సమ్మిట్ లో స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇన్ ఫ్రా స్ట్రక్చర్, సంక్షేమం, ఇండస్ట్రీ, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని, టైమ్ నిడివి ముందుగానే నిర్ణయించాలన్నారు. ఈవెంట్స్ వారీగా ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ IAS అధికారిని బాధ్యుడిగా నియమించాలని సీఎం సూచనలు చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+