మోగిన బడి గంట - ఇంగ్లీషు మీడియం స్కూళ్ల ప్రారంభం : విద్యార్ధులకు నేతల స్వాగతం..!!
వేసవి సెలవులు ముగిశాయి. తిరిగి బడి గంట మోగుతోంది. రెండేళ్ల విరామం తరువాత కొత్త విద్యా సంవత్సరం సరైన సమయానికి ప్రారంభం అవుతోంది. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా పాఠశాలల ప్రారంభం వాయిదా పడుతుందనే వాదనల పైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేటి నుంచి పాఠశాలలు ముందుగా నిర్ణయించిన విధంగా యధాతథంగా ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.
తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 ఏడాది నుంచి ఒకేసారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనుంది. ఈ విషయంలో విద్యార్ధులకే నిర్ణయం తీసుకొనే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన ప్రారంభిస్తుండటంతో ముందుగా నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు తరహాలో తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పుస్తకాలు అందించనున్నారు. ఉచితంగా యూనిఫాం, మధ్యాహ్నభోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది.

దాదాపు 70 వేల మంది పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఈ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్న వేళ..విద్యార్ధులకు స్థానిక ప్రజా ప్రతినిధులు..ఎమ్మెల్యేలతో కలిసి విద్యార్ధులకు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.7,289.54కోట్లు ఖర్చుచేస్తున్నామని, తొలిదశలో రూ.3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి సబిత వెల్లడించారు. ఇక, వేసవి సెలవుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్దులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో..ఆదివారం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చే వారితో టోల్ గేట్ల వద్ద రద్దీ ఏర్పడింది.












Click it and Unblock the Notifications