Schools Reopen: తొలిరోజు రెస్పాన్స్ ఎలా ఉందంటే-ఆ జిల్లాలో అత్యధిక హాజరు-ఓవైపు టెన్షన్... మరోవైపు బెంగ..
రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పున:ప్రారంభమయ్యాయి.చాలాచోట్ల మొదటి రోజు విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు.అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరవగా... అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాల్లో 13.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే హజరయ్యారు.తొలిరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.

ఓవైపు ఆ టెన్షన్... మరోవైపు బెంగ...
ఓవైపు కరోనా టెన్షన్... మరోవైపు పిల్లలు చదువుకు దూరమవుతున్నారనే బెంగ... ఈ నేపథ్యంలో మొదటిరోజు పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు చాలామంది తల్లిదండ్రులు తటపటాయించారు.కొద్దిరోజులు వేచి చూశాక పంపిద్దామని కొంతమంది తల్లిదండ్రులు భావించగా... మరికొంతమంది ధైర్యంగా పిల్లలను స్కూళ్లకు పంపించారు. ఏడాదిన్నర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు కొంతమేర కళకళలాడాయి. ఆన్‌లైన్ క్లాసులు వినే అవకాశం ఉండటం... తప్పనిసరిగా స్కూల్‌కు రావాల్సిందేననే ఒత్తిడి ఏమీ లేకపోవడంతో తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువగానే నమోదైంది.

ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్‌కే ప్రాధాన్యం..
ప్రైవే ట్ స్కూళ్లు ఇప్పటికీ ఆన్‌లైన్ క్లాసులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పుడే స్కూళ్లు తెరవడం కంటే కొద్దిరోజులు ప్రభుత్వ పాఠశాలల పనితీరు చూశాక తెరవాలనే ఆలోచనలో కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయి. అందుకే తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లల్లో సుమారు 27.45 శాతం మంది విద్యార్థులకు పాఠశాలలకు హాజరవగా... ప్రైవేట్‌లో మాత్రం 18.35 శాతం మంది విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరయ్యారు.

ఎంతమంది హాజరయ్యారంటే....
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 52,22,174 మంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో 11,37,095 (21.77 శాతం) మంది తొలిరోజు స్కూళ్లకు హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 19,66,234 మంది విద్యార్థులు ఉండగా... తొలి రోజు 5,39,674 (27.45 శాతం) మంది క్లాసులకు హాజరయ్యారు. ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 32,55,940 మంది విద్యార్థులు ఉండగా... తొలిరోజు 5,97,421 (18.35 శాతం) మంది హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో కొన్నిచోట్ల విద్యార్థులకు మంగళహారతులు,బ్యాండ్ మేళాలు,పూలతో టీచర్లు స్వాగతం పలకడం విశేషం. గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల పున:ప్రారంభానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాలేజీల్లో పరిస్థితేంటి...
జూనియర్ కాలేజీల్లోనూ తొలిరోజు హాజరు శాతం నామమాత్రంగానే ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 97,520 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా... తొలిరోజు కేవలం 16,907(17శాతం) మంది మాత్రమే క్లాసులకు హాజరయ్యారు.సెకండియర్‌లో 84,038 మంది విద్యార్థులకు గాను కేవలం 12,687 మంది మాత్రమే హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో 10 శాతం లోపే హాజరు నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్‌లో ఫస్టియర్‌లో 52 శాతం,సెకండియర్‌లో 59శాతం మంది కాలేజీలకు హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో సెకండియర్ క్లాసులను మాత్రమే ప్రారంభించారు.రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ హాస్టళ్లను పున:ప్రారంభించారు. యూనివర్సిటీల అధికారులతో బుధవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి సమావేశాన్ని నిర్వహించారు. వర్సిటీల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో తరగతులను నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే....
పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే క్లాసులు నిర్వహించారు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారంవిద్యార్థులు విధిగా మాస్కు ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్థిని మాత్రమే కూర్చోబెడుతున్నారు. కొన్నిచోట్ల వర్ష ప్రభావం కూడా విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపించింది. కొన్నిచోట్ల పాఠశాలలకు వెళ్లే దారిలో బురద పేరుకుపోవడంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపోయారు.కొన్నిచోట్ల విద్యా వాలంటీర్లు లేక స్కూళ్లు తెరుచుకోలేదు.

భయాందోళనలు,అనుమానాలు వద్దని...
పిల్లల్ని స్కూళ్లకు పంపించే విషయంలో తల్లిదండ్రులకు ఎటువంటి భయాందోళన వద్దని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిల్లలపై కరోనా ప్రభా వం తక్కువ అన్నారు. కాబట్టి కరోనా భయాలు,అనుమానాలు వీడి నిరభ్యంతరంగా పిల్లలను పాఠశాలలకు పంపించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే విద్యార్థులకు పాఠాలు పూర్తి స్థాయిలో అర్థమవుతాయని.. ప్రత్యక్ష బోధనే విద్యకు సార్థకత అని అభిప్రాయపడ్డారు.మరో కొత్త రకం వేరియంట్ లేదా ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొస్తే తప్ప థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు. బోధన, బోధనేతర సిబ్బందిలో 95 శాతం మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కాబట్టి వీరి నుంచి కరోనా సంక్రమించే అవకాశం లేదన్నారు. మిగతావారిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బడిలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు. ప్రతీ ఒక్కరూ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చునన్నారు.

థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం...
అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నప్పటికీ... దానికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలేమీ లేవన్నారు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ శుభ కార్యాలు, పండుగలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసి దాదాపు రెండున్నర నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు అత్యల్పంగానే నమోదవు తున్నాయని గుర్తుచేశారు. పిల్లలు కూడా కరోనా నుంచి త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు.
ఒకవేళ ఎవరైనా పిల్లల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని పాఠశాల నుంచి తల్లిదండ్రుల వద్దకు పంపించాలని ఆదేశాలిచ్చామన్నారు. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు. ఒకవేళ ఒక విద్యార్థిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ విద్యార్థిని ప్రత్యేక గదిలోకి మార్చి... మిగతావారిని పరిశీలనలో ఉంచడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఇంటి వద్ద లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు పాఠశాలకు పంపవద్దని అన్నారు.












Click it and Unblock the Notifications