TG Sarpanch Elections : ప్రశాంతంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ..!
తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అందులో 415 గ్రామ సర్పంచి, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో అయిదు గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా.. మరో రెండు గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. దాంతో మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
మొత్తంగా 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు.. 29,917 వార్డు సభ్యుల పదవులకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు గాను 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచారు. ఎన్నికల్లో 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ని ఎన్నుకుంటారు.

ఇక ఈ ఎన్నిక నిర్వహణ కోసం 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 40,626 బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తుండగా.. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు మెదక్ జిల్లా నార్సింగిలోని పెద్ద తండా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. ప్రత్యర్థి అభ్యర్థి ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఈ రకంగా ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అలానే మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామికి గుండెపోటుతో వచ్చింది. పోలింగ్ రోజు ఉదయమే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయనను హుటాహుటిన మంచిర్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications