సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్.. క్లోజ్: కుళ్లిన మాంసం వడ్డన
హైదరాబాద్: జంటనగరాల్లో ఆల్ఫా హోటల్ పేరు తెలియని వారు ఉండరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఈ హోటల్.. నాన్ వెజ్ ఫుడ్‌కు పెట్టింది పేరు. ఆల్ఫా హోటల్ బిరియాని, ఆల్ఫా హోటల్ ఇరానీ చాయ్, ఆల్ఫా హోటల్ బిస్కెట్స్, ఆల్ఫా హోటల్ ఖీమా.. ఇలా అన్నీ ప్రత్యేకతలే ఉండే ఈ రెస్టారెంట్- మూత పడింది.
దీనికి కారణం లేకపోలేదు. నాసిరకంగా ఆహారాన్ని జనాలకు వడ్డించడం మూత పడటానికి కారణమైంది. రెండు రోజుల కిందట అంటే ఈ నెల 15వ తేదీన ఆల్ఫా హోటల్‌లో రోటీ, ఖీమా తిన్న 40 సంవత్సరాల జమాలుద్దీన్, మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు. ఖీమా తినేటప్పుడే కుళ్లిన వాసన రావడాన్ని పసిగట్టారు.

అప్పుడే ఈ విషయాన్ని హోటల్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. పెద్దగా ఫలితం రాలేదు. ఆ తరువాత వారిద్దరూ అనారోగ్యానికి గురయ్యాడు. రెండురోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీనికంతటికీ కారణం- ఆల్ఫా హోటల్‌లో తిన్న ఖీమా, రోటీనే కారణమనే నిర్ధారణకు వచ్చారు.
ఈ విషయంపై వారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. తాము తిన్న ఖీమా, రోటీ బిల్ కాపీని తమ ఫిర్యాదుకు జత చేశారు. డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్కిప్షన్‌నూ వారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి పంపించారు.

ఫిర్యాదు అందిన తరువాత అధికారులు రంగంలోకి దిగారు. ఈ సాయంత్రం వారు ఆల్ఫా హోటల్‌పై మెరుపుదాడి చేశారు. వంటగది సహా హోటల్ మొత్తం తనిఖీ చేశారు. నాణ్యత లేని, నాసిరకంగా ఉండే మాంసం, ఇతర ఆహార పదార్థాలు, మసాలా దినుసులను వాడుతున్నట్లు పసిగట్టారు. ఇరానీ చాయ్ తయారీలోనూ నాణ్యత లేని టీ పౌడర్‌ను వాడుతున్నట్లు నిర్ధారించారు.

దీనితో ఆల్ఫా హోటల్ యాజమాన్యానికి నోటీసులను ఇచ్చి, దాన్ని మూత వేశారు. హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసు సైతం నమోదు చేసినట్లు తెలుస్తోంది. మాంసం, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి శాంపిళ్లను ల్యాబొరేటరీకి పంపించారు.












Click it and Unblock the Notifications