పోర్న్ వీడియోలు చూపించి వీర్య సేకరణ.. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో దారుణాలు!
సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులను సరోగసి ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులైన డాక్టర్ నమ్రత మోసం చేశారు. వారి నుండి 30 లక్షల రూపాయలను తీసుకుని సరోగసి ద్వారా వేరే వ్యక్తి వీర్యంతో కలిగిన సంతానాన్ని వారి సంతానంగా నమ్మించారు.
బిడ్డ తమ సంతానం కాదని వైద్యురాలి నిలదీత
బిడ్డ జన్మించిన తర్వాత డీఎన్ఏ నమూనాలను సరిపోల్చి తన బిడ్డ అని ధ్రువీకరించాలని కోరిన తల్లిదండ్రులను మోసం చేశారు. సరోగసి ద్వారా తమ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ డిఎన్ఏతో అలాగే సదరు తండ్రి డిఎన్ఏతో సరిపోల్చాలి అని దంపతులు షరతు విధించారు. అయితే తల్లిదండ్రుల డిఎన్ఏ తో బిడ్డ డిఎన్ఏ సరి పోల్చలేకపోవడంతో జూన్ రెండవ వారంలో వైద్యురాలిని సంప్రదించి బిడ్డ తమకు జన్మించలేదని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పారు.

మోసంపై పోలీసులకు ఫిర్యాదు.. కేసులో పలు షాకింగ్ విషయాలు
దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి కాస్త సమయం కావాలని కోరిన నమ్రత ఆ తర్వాత నుండి ఆచూకీ లేకుండా పోయారు. ఇక తాము మోసపోయామని భావించి గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఈ కేసులో వీర్యకణాల అక్రమ సేకరణ గుట్టు రట్టు చేశారు.
ఆ వీడియోలు చూపిస్తూ వీర్యం సేకరణ
క్లినిక్ నిర్వాహకులు పోర్న్ వీడియోలు చూపిస్తూ వీర్య కణాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 16 వీర్యకణాల శాంపిల్స్ ను స్వాధీనం చేసుకొని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి కి అప్పగించారు. నిందితులు సరోగసి కోసం వీర్యకణాలను సేకరిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడ సేకరించినటువంటి వీర్యకణాలను అహ్మదాబాద్ పంపుతున్నట్టు గుర్తించారు .
ఏడుగురు నిందితుల అరెస్ట్... అన్ని బ్రాంచీలలో తనిఖీలు
ఈ కేసులో ఇప్పటికి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల అక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నట్టు గుర్తించారు. హైదరాబాద్లో మాత్రమే కాకుండా విశాఖపట్నం, విజయవాడలోనూ ఈ సంస్థ బ్రాంచీలలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వీరు ఫెర్టిలిటీ సెంటర్ లను నిర్వహిస్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్స్ కు వెళ్ళేవారు జాగ్రత్త
ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిస్సా, కోల్కతాలో కూడా వీరికి బ్రాంచీలు ఉన్నట్టు పేర్కొన్నారు. అక్రమ సరోగసి, అక్రమ వీర్యకణాల సేకరణ పైన, ఇటువంటి సెంటర్లలో సంతాన సాఫల్యం కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications