7గురు స్త్రీల హత్య: పట్టుబడిన సీరియల్ కిల్లర్
మహబూబ్‌నగర్: కల్లు దుకాణాలకు వచ్చే మహిళలతో స్నేహం పెంచుకుని, వారిని అంతం చేసి, నగలతో పరారవుతున్న సీరియల్ కిల్లర్ ఎరుకలి శ్రీను(36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బాలానగర్ మండలం గుండేడ్‌కు చెందిన శ్రీను వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మహిళలను హత్య చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలతో పారిపోయి జల్సాలు చేశాడు. తిమ్మాజీపేట మండలం ఆవంచలో వరుసకు మేనత్త అయిన లక్ష్మమ్మను 2007లో హత్య చేశాడని, ఈ కేసులో ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించిన శ్రీను, 2013 డిసెంబర్‌లో విడుదలై 2014 లో ఇద్దరు గుర్తు తెలియని మహిళలను హతమార్చాడని తెలిపారు.

2015 జనవరి 10న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పోసెట్టిగూడ శివారులో తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన కావలి ఇందిర, 2015 జనవరి 27న ఇదే పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్న గోల్కొండ శివారులో తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన జంగమ్మ (35)లను అతను హత్య చేశాడు.
కేశంపేట పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్లాస్‌ఖాన్‌పేట శివారులో 2015 మార్చిలో గుర్తుతెలియని మహిళ, షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాంసాన్‌పల్లి శివారులో 2015 మార్చి 13న మరో గుర్తు తెలియని మహిళ, శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లి శివారులో 2015 ఏప్రిల్ 18న గుర్తుతెలియని మహిళలను శ్రీను హతమార్చాడు. శ్రీను నుంచి బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications