BRSలో ఆ ఏడుగురు చేసిన తప్పేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదటి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో కేవలం ఏడుగురు సిట్టింగ్ లకే టికెట్లు నిరాకరించారు. ఉప్పల్, బోథ్, స్టేషన్ ఘన్ పూర్, వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మార్పులు చేసి వీరికి టిక్కెట్లు నిరాకరించారు.
అసిఫాబాద్: ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఆత్రం సక్కు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇక్కడి టికెట్ ను కోవా లక్ష్మీకి కేటాయించారు. గత ఎన్నికల్లో కోవా లక్ష్మి సక్కు చేతిలోనే ఓటమిపాలయ్యారు. అతనికి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తారనే హామీ లభించినట్లు తెలుస్తోంది.

బోథ్: ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు షాక్ తగిలింది. తొలిజాబితాలో ఆయన పేరు చోటుచేసుకోలేదు. నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు సీటు లభించింది. బాపూరావుపై వ్యతిరేకత పెరగడంవల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘనపూర్: వివాదాస్పదంగా మారిన రాజయ్యను బీఆర్ఎస్ అధిష్టానం తప్పించింది. ఆయనకు బదులుగా సీనియర్ రాజకీయ నాయకుడైన కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. 2012లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న రాజయ్య అప్పటి నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.
వేములవాడ: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు టిక్కెట్ దక్కలేదు. పౌరసత్వ వివాదంతోపాటు జర్మనీలోనే ఎక్కువ సమయం గడుపుతారంటూ పార్టీ క్యాడర్ ఫిర్యాదు కూడా కారణమని భావిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన చల్మెడ ఆనందరావుకు టిక్కెట్ దక్కింది.
ఖానాపూర్: ఇక్కడి నుంచి రెండుసార్లు గెలుపొందిన రేఖానాయక్ కు టిక్కెట్ దక్కలేదు. మంత్రి కేటీఆర్ స్నేహితుడు, ఎన్నారై జాన్సన్ నాయక్ కు టికెట్ ఖరారైంది. వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా దూరం చేసుకోవడంతో అతనికి టికెట్ ఇచ్చినా గెలుపు కష్టమని భావించారు.
ఉప్పల్: సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన బండారి లక్ష్మారెడ్డికి టిక్కెట్ కేటాయించారు.ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా చాలా మంది ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం బండారి వైపే మొగ్గుచూపారు. అవినీతి ఆరోపణలతోపాటు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటమే సుభాష్ రెడ్డికి టిక్కెట్ దక్కలేదు.
వైరా: సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు టిక్కెట్ నిరాకరించారు. అతనిపై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ ఇచ్చారు. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉండటం మరో కారణం.












Click it and Unblock the Notifications