హైదరాబాద్ వాహనదారులకు షాక్.. రోడ్లపై అలా హారన్ కొడితే జైలుకే!
హైదరాబాద్ వాహనదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. వాహనదారుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న పోలీసులు ఇకపై రోడ్లపై వాహనదారులు ఎలా పడితే అలా ప్రయాణం చేసినా, అనవసరంగా హారన్ మోగించినా, రోడ్లపై రయ్యిన దూసుకుపోయినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్లను ఆక్రమించినా, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పై కమీషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు నగరవాసులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుకుందని వాటి కోసం రోడ్ల విస్తరణ చేసినా, ఫ్లై ఓవర్లను నిర్మించిన కూడా ట్రాఫిక్ తగ్గడం లేదన్నారు. వాహనాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఫుట్ పాత్ లను ఆక్రమించి మాఫియాలా.. ట్రాఫిక్ ఇబ్బంది
హైదరాబాద్ నగరంలో చాలా వరకు ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురయ్యాయని, చిరు వ్యాపారులు తోపుడుబండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారని, అయితే వీటి కారణంగా ట్రాఫిక్ కి కొంత ఇబ్బంది కలుగుతుందన్నారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఫుట్ పాత్ లను ఆక్రమించి హైదరాబాద్ నగరంలో ఇది ఒక మాఫియాలా తయారైందని నగర కమిషనర్ సివి ఆనంద్ పేర్కొన్నారు.
ఫుట్ పాత్ లపై దుకాణాలు పెట్టవద్దు
దీంతో విఐపి ల రాకపోకలకు కూడా పెద్ద సమస్యగా మారుతుందని ఆయన తెలిపారు. ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని చేపట్టి ఫుట్ పాత్ లను ఆక్రమించిన దుకాణాలను, తోపుడుబండ్లను తొలగించారు. ఫుట్ పాత్ లపైన ఎవరు దుకాణాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు.
సైరన్ హారన్ ల వినియోగంపై కఠిన చర్యలు
ఇక ఇదే సమయంలో హైదరాబాద్లో చాలామంది అనవసరంగా సైరన్ హారన్ మోగిస్తున్నారని, హారన్ ఉపయోగించడం పైన హైకోర్టు, సుప్రీంకోర్టుల నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరూ అనవసరంగా హారన్ మోగించకూడదని సూచించారు. ఎవరైతే అనవసరంగా హారన్ మోగిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసులు పెట్టి జైలుకు పంపుతామన్నారు.
సైరన్ హారన్ లు ఉపయోగించకూడదు
సైరన్ హారన్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే చాలా వాటిని సీజ్ చేశామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే వాటిని మోగిస్తుందని, మిగతా ఎవరు వాటిని వినియోగించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications