టీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధుమోహన్
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ కాంటేకార్ మధుమోహన్... భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మధు మోహన్‌తో పాటు ఆయన అనుచరులు కూడా బీజేపీలో చేరారు.
గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మధు మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్ఎస్‌లోకి చేరి తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మదన్ మోహన్ పార్టీ మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మంతనాలు ఫలించటంతో మధు కాషాయ కండువా కప్పుకున్నారు.
కాగా, మధుమోహన్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూధర్మం కోసం ఆయన అనేక సందర్భాల్లో పోరాడారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ ఛైర్మన్లు అన్యాయానికి గురవుతున్నారని తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ అన్నారు.
అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని మధు మోహన్ విమర్శించారు. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ స్వభావం కలిగిన మధు మోహన్ తిరిగి సొంత గూటికి చేరారని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ఎజెండాలో అభివృద్ధి అన్నదే లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్ సహా బీజేపీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.
మోడీ తెలంగాణను అవమానించలేదు.. అవి టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై మోడీ రాజ్యసభలో మాట్లాడారని, టీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తుందని, అది జరగదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీకి అధికార ప్రతినిధిగా మారిందని, కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకునేందుకు అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు ఆపాలని ఆయన అన్నారు.
డీజీపీ వెంటనే స్పందించాలని ఆయన కోరారు. అంతేకాకుండా తెలంగాణ బిల్లుకి బీజేపీ మద్దత్తు ఇచ్చిందని, బిల్లులో లోపాలు ఉన్న తెలంగాణను దృష్టిలో పెట్టుకొని ... బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించిందని ఆయన అన్నారు. ఓ వారం ముందు బిల్లు పెడితే విభజన సమస్యలు ఉండక పోయేవి అని ఆయన వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకా పరిస్కారం కాకపోవడానికి టీఆర్‌ఎస్ సర్కార్ కూడా కారణమని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications