జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: విచారణలో డైరెక్టర్ సుకుమార్ పేరు!
ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఆయనను విచారణ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ విచారణలో పలు ఆసక్తికర విషయాలను చెబుతున్నట్టు సమాచారం. ఈ కేసులో జానీ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం.
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న 21 సంవత్సరాల యువతిని వేధింపులకు గురి చేస్తున్నారని యువతి కేసు పెట్టడంతో దుమారం రేగింది. చిత్ర పరిశ్రమలో కూడా ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్ ఆమెను లైంగికంగా వేధిస్తూ ఎవరికీ చెప్పొద్దని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నారని సదరు యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జైలుకెళ్ళిన జానీ మాస్టర్
పదహారేళ్ళ వయసులో మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని సదరు యువతి జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కూడా ఆయన మీద కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
సుకుమార్ పేరు చెప్పిన జానీ మాస్టర్
పోలీసులు జానీ మాస్టర్ ను విచారించాలని కస్టడీకి కోరగా కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు. అయితే విచారణలో జానీ మాస్టర్ అనేక సంచలన విషయాలను బయటపెడుతున్నారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు డైరెక్టర్ సుకుమార్ కు తెలుసని జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం.
ఆమె తనను వేధించింది
బాధితురాలు స్టేట్మెంట్ ను ముందు ఉంచి జానీ మాస్టర్ ను విచారిస్తున్న నార్సింగి పోలీసులు పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెబుతున్నట్టు సమాచారం. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని, మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాను అని చెప్పేది అబద్ధమన్నారని సమాచారం.
సుకుమార్ చెప్పినా ఆమెలో మార్పు రాలేదు
ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ ని గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చానని జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె వేధించిందని అనేకమార్లు తన ఇబ్బందులను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకువెళ్లానని సుకుమార్ ఆమెని పిలిచి మాట్లాడినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదనీ జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం.
తనపైన ఇదంతా కుట్ర
తన పైన ఏదో కుట్ర చేసి ఎవరో ఆ అమ్మాయితో తన పైన కేసు పెట్టించారని జానీ మాస్టర్ అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ కేసులో సుకుమార్ కు చాలా విషయాలు తెలుసు అని జానీ మాస్టర్ చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది. ఇక రేపటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. దీంతో జానీ మాస్టర్ కస్టడీ తర్వాత కేసులో పురోగతి ఎలా ఉంటుందో ఆసక్తి కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications