Shocking video: తెలంగాణా యూనివర్సిటీ వీసీ కాళ్ళు మొక్కిన బాధితులు.. దేనికంటే!!
తెలంగాణలోనే అదో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. స్వరాష్ట్రం పేరుతో ఏర్పాటైన ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు కాంట్రావర్సికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. చదువుల సంగతి దేవుడెరుగు.. విశ్వవిద్యాలయ మనుగడ ప్రశ్నార్ధకం చేసే వ్యవహారాలు యూనివర్సిటీ పరువు బజారున పడేలా చేస్తున్నాయి. గల్లీ లొల్లిని తలపించేలా రిజిస్ట్రార్ కుర్చీ వివాదం.. అక్రమ నియామకాల ఆరోపణలు కొనసాగుతున్నాయి.
నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ ఇలా వరుస పరిణామాలు యూనివర్సిటీ ప్రతిష్టను రాష్ట్ర స్దాయిలో మసకబారేలా చేశాయి.తాజాగా ఇప్పుడు కూడా మరోమారు తెలంగాణ విశ్వవిద్యాలయం లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని వినూత్నంగా నిరసన కు తెరతీశారు.

ఉద్యోగాల పేరుతో డైలీ వేజ్ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వీసీ రవీందర్ గుప్తా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. వీరంతా ఉద్యోగం వద్దూ.. ఏమీ వద్దని తమ డబ్బులు ఇప్పించాలంటూ వీసీ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. ఉద్యోగాల కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వర్సిటీ పరిపాలన వీసీ ఆచార్య రవీందర్ గుప్తా కాళ్లు మొక్కారు.
భిక్కనూర్ దక్షిణ ప్రాంగణ బాధితులు తమ డబ్బులు తమకు రిటర్న్ ఇప్పించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస సంఘటనలతో యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. అంతా నా ఇష్టం అన్న చందంలో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా వ్యవహరించటం, అక్రమ నియామకాలు చేపట్టడం తోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణా యూనివర్సిటీ వీసీ కాళ్ళు మొక్కిన బాధితులు.. దేనికంటే!!#TelanganaUniversity #StudentsUnion #Nizamabad #Telangana #Oneindiatelugu pic.twitter.com/PV1LISK1WW
— oneindiatelugu (@oneindiatelugu) June 15, 2023
యూనివర్సిటీలో పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయి? ఈ ఘటన నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అనేది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని మంచి మార్గంలో పెట్టాల్సిన యూనివర్సిటీ పాలక యంత్రాంగమే ఈ విధంగా అవినీతి, అక్రమాలకూ కేరాఫ్ గా మారటం నిజంగా ఆందోళనకరం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో తెలంగాణా యూనివర్సిటీ పరిస్థితిని కళ్ళకు కడుతుంది.












Click it and Unblock the Notifications