వీడిన టెక్కీ హత్య కేసు మిస్టరీ: తాగి తిట్టడం వల్లే చంపేశారు
హైదరాబాద్: ఐదు రోజుల క్రితం హత్యకు గురైన సాప్ట్‌వేర్ ఇంజనీర్ సంజయ్ జంగ్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాగిన మత్తులో తిట్టడం వల్లనే సంజయ్‌ను దుండగులు హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సంజయ్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారు వాడిన స్విఫ్ట్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని పంజగుట్ట వద్ద కారులో సంజయ్ లిఫ్ట్ తీసుకున్నాడని, కారులో ఉన్న నలుగురిని తాగిన మత్తులో సంజయ్ తిట్టాడని, దాంతో ఆగ్రహించిన ఆ నలుగురు వాగ్వివాదానికి దిగారని అంటున్నారు.

సికింద్రాబాదులోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద వారు సంజయ్‌ని దింపారని, అయితే కారు దిగిన తర్వాత కూడా తిట్టడంతో ఆగ్రహించి అతన్ని కత్తితో పొడిచారని పోలీసులు చెబుతున్నారు. దాంతో అతను మరణించాడని చెబుతున్నారు. దుండగులు వాడిన స్విఫ్ట్ కారును సిసిటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తించిన పోలీసులు దాన్ని హైదరాబాదు పాతబస్తీలో స్వాధీనం చేసుకున్నారు.

బుధవారంనాడు విధులకు హాజరైన తర్వాత సంజయ్ కూకట్‌పల్లిలో మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడని, ఆ తర్వాత ఓ మిత్రుడు అతన్ని పంజగుట్ట వద్ద దింపాడని, అక్కడ సంజయ్ కారులో లిఫ్ట్ తీసుకున్నాడని పోలీసులు అంటున్నారు. ఆ క్యాబ్‌ను బంజారాహిల్స్ నుంచి పాతబస్తీకి వెళ్లడానికి నలుగురు వ్యక్తులు మాట్లాడుకున్నారని అంటున్నారు. సంజయ్ హత్య వ్యక్తిగత కారణాల వల్ల గానీ పాతకక్షల కారణంగా గానీ జరిగింది కాదని పోలీసులు అంటున్నారు.













Click it and Unblock the Notifications