నైరుతి రుతుపవనాల ఎంట్రీ: హైదరాబాద్ సిటీతో తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపగా.. సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షం కారణంగా మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. కాగా, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటం గమనార్హం.

హైదరాబాద్ నగరంలోని కొంపల్లి, సుచిత్ర, చింతల్, జగద్గిరిగుట్ట, బాలానగర్, సురారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్‌నగర్, కుషాయిగూడలో భారీ వర్షం కురిసింది. చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడెంలో భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
మరోవైపు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, కీసర, కాప్రా, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, అల్వాల్, బొల్లారం, సికింద్రాబాద్, తిరుమలగిరి, కంటోన్మెంట్, కార్ఖానా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. అయితే, తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు ఈ భారీ వర్షంతో ఉపశమనం లభించింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాగా, సోమవారం నైరుతి రుతుపవనాలు మహబూబ్‌నగర్‌లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications