మేడారం జాతరలో స్పెషల్ అట్రాక్షన్.. తలపై నెమలీకలతో, విలువైన వనమూలికలతో చెంచు కోయదొరలు!!
జాతరంటే మహా జాతర.. కొండకోన పరవశించే జాతర... చెట్టు పుట్ట సమ్మక్క అని నోరార పిలిచే జాతర.. గిరిజన దేవతలకు జోతలిడే జాతర.. రెండేళ్లకోసారి సంబరంగా జరుపుకునే జాతర మేడారం మహా జాతర. మేడారం మహా జాతర సందర్భంగా జనం అంతా వనాల్లోకి చేరింది. మేడారం జనసంద్రమైంది. ఇక ఈ మేడారం జాతరకు ఎప్పుడు ప్రత్యేకంగా నిలిచేవారు, స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించే వారు మాత్రం కోయ దొరలే.
కుర్రో కుర్రు .. కొండ దేవర పలుకు కోన దేవర పలుకు మేడారం సమ్మక్క సారలమ్మ పలుకు అంటూ గిరిజన సంస్కృతిని మర్చిపోకుండా దట్టమైన అటవీ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన వనమూలికలు విక్రయిస్తూ, అక్కడికి వచ్చే సమ్మక్క భక్తులకు తాము నేర్చుకున్న విద్యతో జాతకాలు చెప్తూ వీరు చేసే సందడి అంతా ఇంతా కాదు. నరదృష్టి కి, అనారోగ్యానికి, స్త్రీ సంబంధమైన వ్యాధులకు చెట్ల మూలికలతో వారు చేసే కనికట్టు ఆసక్తికరంగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం మేడారం జాతరకు శ్రీశైలం అడవుల నుండి మాత్రమే కాకుండా, మేడారం అటవీ ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల అటవీ ప్రాంతాల నుండి కూడా చెంచు కోయ దొరలు మేడారం చేరుకుంటారు. ఎక్కడ చూసినా మేడారంలో వేల సంఖ్యలో ఈ కోయదొరలు కనిపిస్తారు.
తలపై నెమలీకలు పెట్టుకొని, మెడలో పూసల దండలతో , నుదిటిన బండారితో ఆసక్తికరంగా కనిపించే వీరు మేడారం జాతర కే స్పెషల్ అట్రాక్షన్. ప్రతి మేడారం జాతర సీజన్లోనూ జాతరకు వచ్చి తమకు తెలిసిన విద్యతో జనాలకు వనమూలికలతో వైద్యాన్ని, నరదృష్టి నివారణలు సూచిస్తారు చెంచు కోయ దొరలు.
గతంలో వీళ్ళు వస్తు మార్పిడి విధానంతో వనమూలికలు అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ విధంగా లేకపోవడంతో డబ్బులు తీసుకొని వనమూలికలను అందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో దొరికే వనమూలికల మీద ఆధారపడి జీవనం సాగించే వీరు, వంశపారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిని ఇంకా కొనసాగిస్తున్నారు.
అయితే తమ కుటుంబాలకు చెందిన భవిష్యత్తు తరాలు మాత్రం ఈ వృత్తికి దూరంగా ఉంటున్నట్టు వారు చెప్తున్నారు. మేడారం జాతరకు వెళ్లే వాళ్ళందరూ కాసేపు సరదాగా తమ జాతకం తెలుసుకోవాలంటే చెంచు కోయ దొరల దగ్గరకు వెళ్లాల్సిందే.












Click it and Unblock the Notifications