తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు రెండు ప్రత్యేక విభాగాలు: రేపట్నుంచే రంగంలోకి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ సమూల నిర్మూలనకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిదిలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి.
హైదరాబాద్ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు బుధవారం నుంచి పటిష్ట చర్యలు చేపట్టనున్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేశారు.

నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్‌లో ఒక ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ఫిబ్రవరి 9న అంటే బుధవారం ఈ రెండు విభాగాలను రాష్ట్ర డీజీపీ ప్రారంభించనున్నారు.
పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలనకు కేసీర్ ఆదేశాలు
దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని ఇప్పుడిప్పుడే మొదలౌవుతున్న తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి సామాజిక బాధ్యతతో వినూత్నరీతిలో ఆలోచన చేయాలని, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే రాష్ట్రంలో మాదకద్రవ్యాలను తరిమికొట్టగలమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ప్రవేశిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే దిశగా ప్రజలను చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు.
1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఎస్ఏబీ, తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా అంతే శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనబరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సిలరీ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం స్పష్టం చేశారు.
డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
డ్రగ్స్ ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. మొదటి వ్యూహంలో భాగంగా ఇప్పటికే డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిని గుర్తించి, వారిని వారు కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలని, నిష్ణాతులైన చురకల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలని సీఎం స్పష్టం చేశారు. స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి డ్రగ్స్ నేరస్థులను గుర్తించి పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు.
ఎంత ఖర్చయినా పర్వాలేదని, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలని, డ్రగ్స్ కంట్రోల్ విషయాలలో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలని సీఎం అన్నారు.
అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి కొకైన్ ఎల్.ఎస్డి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ లో అగ్గి కణికలు లాంటి అధికారులు కావాలన్నారు. గుడుంబా మీద ఇల్లీసిట్ లిక్కర్, డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించాలన్నారు. 'తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్' ను తిరిగి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications