రాజ్యాంగం అప్పుడు గుర్తుకు రాలేదా?: హరీశ్ రావుకు శ్రీధర్ బాబు కౌంటర్
శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని నియమించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. శాసన మండలి చీఫ్ విప్ సహా, ఇతర నియామకాలు రాజ్యాంగ బద్ధంగానే జరిగాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హరీశ్ రావు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.
కేసీఆర్ హయాంలో హరీశ్ రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే.. మండలి ఛైర్మన్, సభాపతి నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

సంప్రదాయం ప్రకారమే ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అనర్హత పిటిషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కాగా, శాసనమండలి చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ఎలా నియమించారంటూ హరీశ్ రావు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాజ్యాంగ ఉల్లంఘనకు ఇదొక ఉదాహరణ అని అన్నారు.
మండలిలో బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడటం చీఫ్ విప్ బాధ్యత అని.. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయన అధికార పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ కు కూడా మండలిలో విప్ ఉంటారని, సభకు హాజరు, బిల్లుపై ఓటింట్ సమయంలో బీఆర్ఎస్ విప్ కూడా పార్టీ సభ్యులకు విప్ ఇస్తారని హరీశ్ రావు చెప్పారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ విప్.. ప్రభుత్వ విప్ కు కూడా విప్ ఇస్తారని హరీశ్ రావు అన్నారు. చీఫ్ విప్ ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రకారం నడుచుకుంటారా? అని ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని హరీశ్ రావు మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సంబంధం లేదని అన్నారని.. ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఎలా ఇచ్చారని హరీశ్ రావు ప్రశ్నించారు.
అంతేగాక, మహేందర్ రెడ్డిపై ఛైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని హరీశ్ రావు తెలిపారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఛైర్మన్ బులెటిన్ ఇచ్చారని అన్నారు. మహేందర్ రెడ్డిపై అనర్హత పిటిషన్ కు ఇంతకుమించిన ఆధారం ఇంకా ఏం ఉంటుందని హరీశ్ రావు ప్రశ్నించారు. ఛైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్ కు మరింత బలం ఇచ్చిందని.. ఆ బులెటిన్ ను కూడా అనర్హత పిటిషన్ లో సాక్ష్యంగా చేరుస్తామని హరీశ్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications