ఈసారి తెలంగాణలో ఎస్ఎస్‌సీ పరీక్షలు పకడ్బందీగా: ప్రతి గదిలోనూ సీసీ కెమెరా
తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలంటిన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలంటిన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించింది.
సీల్ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్ చేసే వరకు ప్రక్రియనంతా సీసీ కెమెరాలలో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పేపర్ల లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలతో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యా శాఖ సీసీ కెమెరాలో నిఘాలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ కెమెరాలను చీఫ్ సూపరింటెంట్, డిపార్ట్‌మెంట్ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాల సెంటర్లంటిన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5.1 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
కాగా, పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్, 30 మీటర్ల రేంజ్, 180 డిగ్రీల వరకు కవర్ చేసేలా సీసీ కెమెరా ఉండాలి. పరీక్షల్లో రికార్డు అయిన డేటాను నిక్షిప్తం చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత సాఫ్ట్ కాపీని భద్రపర్చాలి. సీసీటీవీ ఫుటేజీలకు మానిటర్లను ఏర్పాటు చేయాలి. ప్రైవేటు పాఠశాలల సెంటర్లలోనూ ఆయా యాజమాన్యాలు సొంతంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీసీటీవీ ఫుటేజీని సీల్డ్ కవర్లో భద్రపరిచి డీఈవోలకు అందజేయాలన్నారు. సీసీటీవీ కెమెరాల కొనుగోలు లేదా కిరాయి కోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి. ఒక్కో కెమెరా కిరాయికి రూ. 586, కొనుగోలు చేయాలనుకుంటే రూ. 6900 వెచ్చించవచ్చు. దీంతో ఈసారి పదో తరగతి పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టంగా జరగనున్నాయి.












Click it and Unblock the Notifications