వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ.. ఆ రోజు నుంచే ప్రారంభం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ప్రారంభం అయింది. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తి కాగా.. వాటిని అర్హులైన వారికి పంపిణి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది.
ఆగస్టు నెలలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన.. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలాయాపన చేసిందని మండిపడ్డారు. ఎంతో మంది అర్హులు కార్డులకు దూరం అయ్యారని మంత్రి పొన్నం తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ శ్రావణ మాసంలోనే రేషన్ కార్డులు.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరుగుతోందని అన్నారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో పెద్దలకు, ధనవంతులకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యం ఇప్పుడు పేదలకూ అందుతోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని తెలిపారు. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడే ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ పాలసీ అని మంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications