‘యాదగిరిగుట్ట’పైనా విచారణ జరుపుతాం: బీఆర్ఎస్ ఖాళీ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి: గత ప్రభుత్వ పలు పథకాలు, పనులపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా.. మరికొన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.యాదగిరిగుట్ట నిర్మాణంపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkatreddy) మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చారని ప్రతిపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారని.. కానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని ధ్వజమెత్తారు.

ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం మొత్తం సంపదను దోచుకుని తిన్నదని బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం 6 వేల స్కూల్స్ మూసి వేసిందని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేశామని చెప్పుకొచ్చారు.
నిరుద్యోగుల కోసం గ్రూప్ 1, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు మంత్రి కోమటిరెడ్డి. పద్ధతి ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్సభ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాలేదని ధ్వజమెత్తారు.
ఆర్ఆర్ఆర్(RRR) అలైన్మెంట్పై మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.
యాదగిరి గుట్ట దేవస్థానం నిర్మాణంపై కూడా విచారణ చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, ఆ పార్టీ వాళ్లే తమను అభినందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications