ఆ రైతులకు రైతుబంధు ఆపండి: తెలంగాణా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ లేఖ
తెలంగాణ ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలను గుర్తించి, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాకుండా రైతు బంధుని ఆపే పనిలో పడింది.

రైతులకు పెట్టుబడి సాయం కోసం తీసుకొచ్చిన పథకం రైతు బంధు
రాష్ట్రంలో అన్నదాతలు కష్టాల్లో మునిగిపోకుండా, పెట్టుబడి సహాయం చేసి వారికి అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి 5,000 రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రైతులలోనూ ఈ పథకానికి విశేషమైన ఆదరణ ఉంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు పెట్టుబడులకు అప్పులు చేసి, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుకు పెట్టుబడి ఇవ్వడానికి రైతుబంధు పథకాన్ని తీసుకు వచ్చింది.

గంజాయి సాగు చేస్తున్న రైతులపై కొరడా
అయితే కొందరు రైతులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సహాయాన్ని వ్యవసాయానికి కాకుండా, గంజాయిని సాగు చేయడానికి వినియోగిస్తున్నట్టు తేలింది. ఇటువంటి రైతులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. తప్పు దారిలో వెళ్తున్న గంజాయి సాగు చేస్తున్న రైతులను మళ్లీ సక్రమమైన మార్గంలోకి మళ్ళించటం కోసం సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం కాకుండా గంజాయి సాగు చేస్తున్న వారికి రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులకు కేసీఆర్ తెలిపారు.

148 మంది రైతులు గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తింపు
దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ అధికారులు మహబూబాబాద్, నారాయణఖేడ్, జహీరాబాద్, భూపాలపల్లి, వరంగల్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు చెందిన రైతులు కొందరు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాలలో 148 మంది రైతులు గంజాయిని పండిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఇప్పటికే 121 మంది రైతులపై కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు నల్గొండ, సూర్యాపేటలో కూడా గంజాయి సాగు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
Recommended Video

రైతు బంధు నిధులు కట్ చెయ్యాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి లేఖ
ఈ క్రమంలో తాజాగా గంజాయి సాగు చేస్తున్న 148 మంది రైతుల వివరాలను ప్రభుత్వానికి అందించి రైతుబంధు నిధులను వారికి ఇవ్వకుండా నిలిపివేయాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ లేఖ రాసింది. 148 మంది రైతుల వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ అందించింది. జూన్ లో రైతులకు రైతుబంధు నిధులు విడుదల కానుండగా వీరికి మాత్రం రైతుబంధు నిధులు ఇవ్వకుండా చూడాలని సూచన చేసింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరందరికీ రైతుబంధు పథకాన్ని నిలిపి వేయనున్నారు.












Click it and Unblock the Notifications