ఒక కుటుంబం కోసం కాదు: వారికి సీఎం రేవంత్ వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లుగా అవహేళనకు గురైందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో అందరం తెలంగాణను.. టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు.
రాష్ట్ర వాహనాలు, కార్యాలయాల మీద కూడా అదే రాసుకున్నామని రేవంత్ చెప్పారు. కానీ, గత ప్రభుత్వం మాత్రం టీజీ అక్షరాలు కాదని.. టీఎస్ అని పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. అందుకే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను టీజీ మార్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ రోజుల్లో ఎక్కడ విన్నా 'జయ జయహే తెలంగాణ' గీతం వినిపించేది కానీ.. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆ గీతానికి గౌరవం దక్కలేదన్నారు సీఎం రేవంత్ .
అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 'జయజయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. పదేళ్లపాటు తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడుపుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేటి తెలంగాణ తల్లి రూపం ఒక రాజకీయ పార్టీకి, ఒక కుటుంబానికి నచ్చడం లేదంటూ పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి రూపంపై విమర్లు చేసినా, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీఎం రేవంత్ హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో వెన్నెముకగా వ్యవహరించిన ఎందరో కవులు, కళాకారులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిని సన్మినిస్తున్నామని చెప్పారు. ఆయనకు 300 గజాల స్థలం, రూ. నగదును బహూకరిస్తున్నామని చెప్పారు. మరో ఎనిమిది మంది కవులు, రచయితలను ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసినవారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
ఆకుపచ్చ చీర, గుండుపూసలు, హారం, ముక్కుపుడక, కడియాలు, మెట్టలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు, ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు. కవి అందెశ్రీ తోపాటు పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. తెలంగాణ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన డ్రో షో ప్రజలను ఆకట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, తెలంగాణ గురించిన వివరాలను ఈ షోలో వివరించారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారిక ఆమోదం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి.. చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాల్లో మాటలు, చేతలతో అగౌరర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో చారిత్రాత్మక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. నిర్దేశించిన సుముహూర్థం మేరకు సాయంత్రం 6.05 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కరతాళధ్వనుల మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి… pic.twitter.com/xaA1nvV3dR
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2024
ఇక నుంచి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సంప్రదాయక, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications