పరీక్షలు వాయిదా వేయాలంటూ మంత్రి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
హైదరాబాద్: ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు సోమవారం ముట్టడించారు. శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసం వద్ద భారీ నిరసన చేపట్టారు.
విద్యార్థులందరూ సుమారు 18-25 ఏళ్ల మధ్య ఉంటారని, అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. సత్యసాయి నిగమాగమం నుంచి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

కొద్ది మంది విద్యార్థులతో మాట్లాడి, ఇప్పటికే పరీక్షల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులు చెప్పారు. అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.
అయితే, పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులంతా మంత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మంత్రి నివాసానికి సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు.
Recommended Video
ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలో ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను పలు విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. మీర్‌పేటలోని టీకేఆర్ కాలేజీ గేట్ వద్ద విద్యార్థులను అడ్డుకోవడంతోపాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పరీక్షల వాయిదావేయాలంటూ దాఖలైన్ లంచ్ మోషన్ పిటిషన్.. అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. కాగా, ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications